భారతదేశం వంటి కుల వర్ణ సమాజంలో కులానికీ, ప్రాంతానికీ, వర్గానికీ అతీతంగా ఏ రచనా ఉండదని చాటిచెప్పిన మొట్టిమొదటి అంబేద్కరిస్ట్ తెలుగు రచన నాగప్ప గారి సుందర్రాజు కతులు 'మాదిగోడు' మొత్తం పది కతుల సమాహారమైన 'మాదిగోడు'లోంచి ప్రస్తుతం నేను ఎన్నుకున్న కథానిక 'నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద!'' - మానవీయ సంబంధాలు. వేల ఏళ్ల క్రితం హైందవ బ్రాహ్మాణీయ సమాజం ఊరికీ - వాడకీ మధ్య గీసిన 'కలుషిత రేఖ' ఇంకా చెరిగిపోలేదు. వారిపైన అగ్రకుల సమాజం అమలు చేస్తున్న అణచివేత ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, లైంగిక, రాజకీయ దోపిడీలతోపాటు అమానవీయమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్న దళిత మాదిగ స్త్రీల కథ 'నడిమింట బోడెక్క బసివిరాలయ్యేద!'' పుట్టుక కారణంగా మనిషి విలువ నిర్ణయించే దుర్మార్గం కొనసాగుతున్న స్థితిని, జీవితంలోని అన్ని రంగాల్లోకి కులం వ్యాపించి జీవితాన్ని శాసిస్తోన్న వైనాన్ని, కులం మానవీయ సంబంధాల విధ్వంసానికి, అమానవీయ విలువల్ని ప్రోగు చేసి మనిషిని మనిషిగాకుండా అవమానాల్ని, అత్యాచారాల్ని దుర్భర దారిద్య్రాలను, దారుణమైన వివక్షలను ప్రదర్శిస్తున్న వైనాన్ని చిత్రించిన యదార్థ కథ 'నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద!''.
''నడిమింటి బోడెక్క'' కథలో కేవలం బోడెక్క పాత్రకే పరిమితం కాకుండా బసివిరాలిని ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో జరిగే ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి? ఈ విషయాలన్నింటినీ చాలా లోతుల్లోకెళ్లి చిత్రించాడు రచయిత. పాత్ర సంభాషణ గుండానే మొత్తం కథ నడుస్తుంది. ఇది గొప్ప టెక్నిక్. దళితుల మాటతీరులో పరిమళించే హాస్యం, వ్యంగ్యం ప్రతిభావంతంగా ఉపయోగించుకున్నాడు కథకుడు.
''బసివిరాలుని ఇడిస్తాము అనిన పొద్దుట్నుంచి వొగిటే ఏడుపు యేడుస్తుండాది. యంత సెప్పినా వూరుకోదు. నన్ని బసివిరాలు ఇడదండో... యెవడు కన్న కూలి సేసుకునీ తినేవోనికి ఇచ్చి పెండ్లి సెయ్యిండి'' ఈ సన్నివేశంలో బోడెక్క మనోభావాల్ని, బోడెక్క తల్లి నడిమింటి బెలిగింటి పెద్దమ్మ అంతరంగ చిత్రణని, వారి ఆశల్ని, ఊసుల్ని, దారిద్య్రాన్ని తెలియజేస్తుంది. బోడెక్కకు ఇష్టంలేని ఒక తంతు, కార్యము ఎలా బలవంతంగా రుద్దబడ్తుందో తెలుస్తుంది.'ఏం కందారప్పా. అంటాని కాలుమింద కాలేసుకుని ఎడమ చేత్తో మీసము దువ్వుకుంటూ పెదరెడ్డి అడిగిడిస''. ''రెడీ రూము ముందు పందులు పొర్లాడే దుమ్ములో మోకాళ్లు మద్దిలోకి, మోసేతులు పెట్టుకుని కునిసిన నడిమింటి కందారప్ప నెత్తిమీద రూమాలు తీసి సంకలో పెట్టుకుని రెండు సేతులు ఎత్తి మొక్కి మాట్లాడేది''. ఈ పై రెండు సన్నివేశాల్లో, సంభాషణల్లో పెదిరెడ్డి ఆధిపత్య భావజాలం, పెదిరెడ్డి ముందు మాదిగోడు బానిసలాగ ఎలా సేతులు గట్టుకుని భయం భయంగా ఉంటారో పెద్ద కులాలకి క్రింది కులాలకీ మధ్య గల అంతరాలను పట్టిస్తాడు కథకుడు.
''నా బిడ్డ ఇంగా పెద్దమనిషి అయ్యిలేదు పసిపిల్లని పట్టుకుని బసివిరాలని ఇడసల్లంటే మొనుసు యొగుదు సూడి రొడ్డీ కందారప్ప అంటూండగానే....''మాలోన్ని సెప్పకుండ తన్నల్ల - మాదిగోడ్ని సెప్పి తన్నళ్ల''ని సాన రవుసుమింద మాట్లాడిిస బాయిగడ్డు అనుమంతు.'' ఈ సంభాషణల ద్వారా మాదిగ స్త్రీల పట్ల పెద్దకులపోళ్లకి, కింది కులాల పట్ల అగ్రవర్గం, వారికీ ఎటువంటి చిన్నచూపు ఉందో, నీచ భావన ఉందో అర్ధమవుతుంది.
పెదిరెడ్డి ''ఏం కందారప్పా. బిడ్డకి వొయిసెంత ''పదేండ్లు రొడ్డీ''!
''అయినా పదేండ్లు నేమతినీ. పొయ్యి నేడు నేను వులిగి జాత్రికి పొయ్యింట్ని. సిమింత సిమింత పసిపిల్లల్ని బసివురాళ్లుని ఇడుస్తుంటారు. వొగూరోళ్లు సంకలో పిల్లనే బసివిరాళునిడిసిడిసిరి. మగా అంటే మూడేండ్లు ఉండవప్పా.'' దీన్నిబట్టి మాల మాదిగోళ్ళ జీవితాల్లో, ముఖ్యంగా స్త్రీల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో, అగ్రవర్గాల వారు ఎటువంటి దురాచారాలకు వొడిగడ్తున్నారో అర్థమవుతుంది. కులాలు మానవ సంబంధాల్ని ఏరకంగా హింసించిందీ, కులం మానవ సంబంధాల్ని ఏరకంగా చిత్రించిందీ తెలుస్తుంది.
''అయిపాయ నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద. ఈ పొద్దుట్నుంచి బోడెక్కని యెవుని సాతనైతే వాడు పెట్టుకోవచ్చు. సిత్తకార్తిలో ఆడకుక్క సుట్టు అరువయ్యి ఆరు మొగ కుక్కలు సేరినటు యట్లగ వొగట్ల యేసుకోవళ్లని సూస్తాయో ఇంగట్ల, బోడెక్కకి కన్నిర్నికుము పెట్టి సాతనైనన్నాల్లు పెట్టుకునేకి ఊర్లో వాళ్లంత కాపులు కాస్తుండారు''.
''బోడెక్క ఇంగా పెద్దమడిసి కూడా అయిలేదు ఆ ద్యావుర్లు గట్టిన పూజారాయప్ప, కాలు దొక్కిన కర్నుముసామి, కంకునుము గట్టిన గోరువయ్య - ముగ్గురు ముసిలినాబట్లు కలిసి సాముకార్యుమని పక్కులో పొండబెట్టుకుంటారంట. అన్నిము పున్నిము యెరుగని నడిమింటి బోడెక్కని బసివిరాల్ని సేసి బజారికి యేసిడిసిరి. పెద్దమనిషి అయ్యే తలకాల యింత మంది ముట్టుకుంటారో. పాయము అయ్యిపొయ్యే తలకాయ యంతమంది పిల్లుల్ని పుట్టిస్తారో ''అంటూని దీర్గాలు తీసిడిస గుంతకంటి మస్తానమ్మ పెద్దమ్మ''.
ఇక్కడ మాదిగ బతుకులు, మాదిగ స్త్రీలు ఎలా వారి వారి ఇష్టాలకు వ్యతిరేకంగా విషాదానికి గురౌతారో, వ్యభిచారిగా చేయబడతారో పెద్దకులపోళ్లు చిన్నకులపోళ్ల పట్ల ఎటువంటి మానవ సంబంధాలు కలిగుంటారో, సంస్కార హీనంగా, విలువల్లేని సమాజానికి కారకులుగా ఈ అగ్రవర్గ హిందూ భావజాలం ఉందో విశదమవుతుంది. ఈ కథలో ఒకపక్క బోడెక్కని బసివిని చెయ్యడం మరోప్రక్క దావ్యవరిపోతును బలిచ్చి దాన్ని కుప్పలేసి పంచుకోవడం గూర్చి కథకుడు చిత్రించడం కథని ప్రతీకాత్మకంగా మంచితనానికి, మానవత్వానికి, చెడుకీ, రాక్షస స్వభావపు కులతత్వానికి మధ్య వైవిధ్యాన్నీ, స్త్రీ బలిపశువునిగా ఈ కుల వ్యవస్థ నిలబెట్టిన విధానాన్ని గొప్పగా చెప్పాడు.
''నేనేమన్నా సిన్నమొగోన్నీ అనుకున్నేర్నా...
సిల్లాకట్టెతో సాముకట్టి తిప్పుకుంట కాకులు గద్దుల్ని నంజిరి కండ్లుని తన్నుకుపోనీకుండా ఇల్లుసేరిడిసేన'' అంటూ రచయిత కథని ముగించడం కాకులు గద్దల్లా మాదిగ స్త్రీల మాంసాన్ని అగ్రకుల పురుషాహంకార వ్యవస్థ ఎత్తుకుపోతున్న వైనాన్ని సుందర్రాజు కళ్లకి కట్టినట్లు చిత్రిస్తూనే అటువంటి కాకులు గద్దల్నుండి తన్నుకుపోనీకుండా సంఘానికి, మాదిగ్గేరికి కాపుకాస్తానని, మానవ సంబంధాల్ని నిలబెడతానని పలకడం మాదిగ ఆత్మగౌరవాన్ని బలంగా చెప్పినట్లయింది.
''మాదిగోడు'' మానవ సమాజపు పునాదులను పెళ్లగించింది. అట్టడుగున సమాధి చేయబడ్డ మానవ విలువల యొక్క కడుదయనీయమైన స్థితిని విపులంగా చూపడానికి కర్నూల్‌జిల్లాలోని మొలగులపల్లి మాదిగ కొట్టాల నుండి నేమకల్లు మాదిగ్గేరి మీదుగా మద్దికెర వరకూ రెక్క పుచ్చుకొని మరీ లాక్కుపోతాడు. సుందర్రాజు కొన్ని నిజజీవితాలను జానపద కథను పద్ధతిన స్వీకరించి తెలుగు సమాజానికి కొత్త భాషను, కొత్త నుడికారాన్ని, కొత్త లోకాన్ని, కొత్త భౌగోళిక ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని అందులో వుండే వైవిధ్యాన్ని, బహుముఖీనతను బలంగా చిత్రించాడు. ఈ కథల్లో కథానాయకుడెక్కడా మనకు కనబడడు. కథకుడే కథానాయకుడై మనల్ని నడిపిస్తాడు. వస్తుపరంగా, రూపపరంగా నిర్దిష్టతను సాధించి ఇది నా బతుకు, నా భాష, ఇవన్నీ మా సమస్యలే అని ఆత్మీయంగా గుండెలను హత్తుకునేలా ఒక చారిత్రక అవసరాన్ని తీర్చే రచనగా ఈ 'మాదిగోడు' కథలు కన్పిస్తాయి.
ఈ కథల్లో బతుకు స్పర్శతో పాటు నేటివిటీ, ఒరిజినాలిటీ కన్పిస్తుంది. మాదిగల జీవన స్థితిగతులను, ఆచార వ్యవహారాలను, సాంస్కృతిక విశేషాలను గొప్పగా అందించాడు. ఈ కథలు ఊహల్లోంచి అమాంతం ఊడిపడినవి కావు. ఏ.సి గదుల్లో కూర్చొని ఎండలో శ్రమించేవారి బాధల్ని కలగని వీరావేశంలో రాసిపారేసిన కథలు అంతకంటే కావు. ఇది కష్టాల నుండి, సొంత అనుభవాల నుండి పెల్లుబికిన కథలు. బతుకు పేగు తెంచుకుపుట్టన బరువైన కథలు. మాదిగ సామాజిక, సాంస్కృతిక చరిత్ర కథలు. కథల పాత్ర చిత్రణ కంటే జీవన చిత్రణకే ఎక్కువ ప్రాధాన్యత కన్పిస్తుందీ కథల్లో. పాత్రను చెబ్తుంటే ఆ పాత్ర నడిపించే సామాజిక వ్యవస్థ రూపురేఖల్ని అచ్చుగుద్దినట్లు చిత్రిస్తాడు. ఒక్కొక్క కథ ఒక్కో దృశ్య కావ్యమే.-శిఖా ఆకాష్
soujanyam: prajasakti daily ( 23-10-2011)
0 comments:
Post a Comment